పేటీఎం బ్యాన్ కు కారణాలు ఇవే !

పేటీఎం బ్యాన్ కు కారణాలు ఇవే !

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ షేర్లు సోమవారం 12 శాతం పతనం అయ్యాయి. బ్యాంకులో నిధులు మదుపుతో పరోక్ష పెట్టుబడిదారులుగా ఉన్న చైనా సంస్థలకు డేటా షేర్ చేసిందన్న అభియోగంపై మార్చి 11న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చైనా ఆలీబాబా గ్రూప్, జాక్ మా ఆంట్ గ్రూప్ సంస్థలకు పేటీఎంలో షేర్లు ఉన్నాయి. కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను ఆర్బీఐ ఆదేశించింది. కానీ, తాము ఖాతాదారుల డేటాను విదేశీ సంస్థలతో షేర్ చేయలేదని, కేంద్రం నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నట్లు పేటీఎం చెప్పుకొచ్చింది.పేటీఎం బ్యాన్ కు కారణాలు ఇవే !కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విదేశాల్లోని డేటా సర్వర్లలో సమాచారం షేర్ చేసినట్లు ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో సంస్థ లావాదేవీలపైన, ఐటీ సిస్టమ్ పనితీరుపై అడిటింగ్ సంస్థతో దర్యాప్తు చేయించాలని పేటీఎంకు స్పష్టం చేసింది. సదరు అడిటింగ్ నివేదిక ఆధారంగా భవిష్యత్ లో నూతన కస్టమర్లను చేర్చుకునేందుకు అనుమతించే విషయమై సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోనున్నది. పేటీఎంపై నిషేధం విధించడం ఇది రెండో సారి. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై 2018 ఆగస్టులోనూ పేటీఎంపై ఆర్బీఐ నిషేధం విధించింది.

గత డిసెంబర్ నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రూ.926 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. సంస్థ వెబ్ సైట్ ప్రకారం 30 కోట్లకు పైగా వాలెట్లు, 6 కోట్ల బ్యాంక్ ఖాతాలున్నాయి. ఖాతాదారులకు పేటీఎం, జీరో బ్యాలెన్స్ అకౌంట్, స్పెండ్ అనలిటిక్స్ , డిజిటల్ పాస్ బుక్ , వర్చువల్ డెబిట్ కార్డు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, మనీ ట్రాన్స్ ఫర్ సేవలందిస్తున్నది.

2017 లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను ప్రారంభించారు. నొయిడాలో తొలి శాఖ ఏర్పాటు చేయడం ద్వారా సేవింగ్స్ ఖాతా సేవలు ప్రారంభించింది. ఐఎంపీఎస్, నెఫ్ట్ , ఆర్టీజీఎస్ , యూపీఐ, ఫాస్టాగ్ , నెట్ బ్యాంకింగ్ వసతులు అందుబాటులో ఉన్నాయి. 2018 లో డెబిట్ కార్డును ప్రారంభించింది. డీఎండీ, నోడల్ అకౌంట్, నాచ్ సేవలను కూడా ప్రారంభించింది. 2019లో కరెంట్ ఖాతా సేవలు అందుబాటులోకి తెచ్చింది. 2020లో వీడియో కేవైసీ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చింది. గత యేడాది మాస్టర్ కార్డ్ డీసీ, ఎన్సీఎంసీ, ప్రీపెయిడ్ కార్డులు ఆవిష్కరించింది. గత డిసెంబర్ లో షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభించడానికి ఆర్బీఐ అనుమతించింది.