‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ రివ్యూ

‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ రివ్యూ

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు చేసుకుందో కళ్లకు కట్టినట్లు చూపిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. గతంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’కు దర్శకత్వం వహించిన వివేక్ అగ్నిహోత్రి , ‘ది కశ్మీర్ ఫైల్స్’ ని ఇప్పుడు తెరకెక్కించాడు. గతంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు చక్కని ఆదరణ లభించడంతో సహజంగానే అందరి దృష్టి ‘ది కశ్మీర్ ఫైల్స్’ మీద పడింది.'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ రివ్యూ

నాడు ఏం జరిగింది..
1990 లో కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేశారు. సామూహిక మానభంగానికి పాల్పడ్డారు. కశ్మీర్ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మారాలని, లేదంటే చంపేస్తామని మగవాళ్లను బెదిరించారు. అడ్డగించిన వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగిన వారిని చంపేశారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడులు చేశారు.

అప్పటి వరకు పక్కపక్కనే కలిసి మెలిసి ఉన్న ముస్లింలు సైతం పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి వికృత చేస్టలకు పాల్పడ్డారు. ఫలితంగా దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్ పాత్స్ పై యేళ్ల తరబడి జీవితాన్ని వెళ్లదీశారు. మరికొందరు జీవించడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలసపోయారు. వేలాది కుటుంబాలు కాలక్రమంలో చెల్లాచెదురైపోయాయి.

ఈ సినిమాకు ప్రతిరూపంగా నిలిచిన సజీవ సాక్ష్యాలు..
ఆనాటి చేదు సంఘటనలకు ప్రతిరూపంగా ఈ చిత్రంలో పుష్కర్ నాథ్ పండిట్ ( అనుపమ్ ఖేర్ ) కుటుంబాన్ని చూపించారు. కశ్మీరీ పండిట్స్ పై ముస్లిం ముష్కర మూకలు దాడి చేస్తున్నా, నిస్సహాయంగా నిలిచిపోయిన చేతకాని ప్రభుత్వ అధికారులకు ప్రతీకగా బ్రహ్మదత్ ఐఏఎస్ ( మిథున్ చక్రవర్తి ), వారి నారాయణ్ డీజీపీ ( పునీత్ ఇస్సార్ ) లను చూపించారు. ఇక చరిత్రను వక్రీకరిస్తూ, కశ్మీర్ లోయలో అసలు ఏం జరగనట్టే ప్రపంచానికి తెలియచేసే సోకాల్డ్ సెక్యులర్, లిబరల్ లెఫ్ట్ ఐడియాలజిస్టులకు ఉదాహరణగా ప్రొఫెసర్ రాధికా మీనన్ ( పల్లవి జోషి ) పాత్రను మలిచారు.

జరిగిన వాస్తవాలను తెలుసుకోకుండా, ఉదారవాద సిద్ధాంతాలనే తలకెక్కించుకుని, తన వారికి జరిగిన అన్యాయాన్ని విస్మరించిన నేటి యువతరానికి ప్రతీకగా కృష్ణ పండిట్ ( దర్శన్ కుమార్ ) పాత్రను మలిచారు. వీరందరి ద్వారా మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో అసలేం జరిగిందనే దానిని వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టనట్లు చూపించాడు. ఆనాటి దారుణాలను కళ్లకు కట్టినట్లు స్క్రీన్ మీద చూపిస్తుంటే కళ్ల వెంట నీళ్లు రావడం ఖాయం. ఈ ముష్కరులను ఏం చేయలేకపోయామే అనే ఆవేశంతో పిడికిళ్లు బిగుసుకోవడం సహజం.

ఈ సినిమాలో తెరకెక్కిన అంశాలు..
ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను, కశ్మీర్ ను తమ దేశంలో కలుపుకోవడానికి పాక్ చేసిన కుట్రలు, అందుకు దాసోహమన్న స్థానిక ముస్లింల మనస్తత్వాన్ని, ఆ సంఘటనలను తమ రాజకీయ లబ్దికి వాడుకున్న నేతల వికృత చేష్టలను ‘ది కశ్మీర్ ఫైల్స్’ లో వివేక్ అగ్నిహోత్రి చూపించాడు. ఓ రకంగా డాక్యుమెంటరీ పద్ధతిలో సాగిన ఈ సినిమాలో ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు అన్నట్లుగానే ఉంది. నిజాలను వక్రీకరించినట్లు కానీ, లేని దాన్ని ఉన్నట్లుగా చూపినట్టుగానీ ఎక్కడా కనిపించదు. కథ సాగే క్రమం, యాక్టర్స్ నలన అందుకు బలం చేకూర్చింది.

అలానే రోహిత్ శర్మ నేపథ్య సంగీతం ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందేలా చేస్తుంది. కశ్మీర్ పండిట్స్ గురించి కథలతో హిందీలో ఒకటి రెండు సినిమాలతో పాటు తెలుగులోనూ ‘ ఆపరేషన్ గోల్డోన్ ఫిష్’ సినిమా వచ్చింది. కానీ వాటిల్లోనూ కశ్మీర్ పండిట్స్ పట్ల జరిగిన దారుణాన్ని ఇంత నిజాయితీగా, కళ్లకు కట్టినట్లుగా చూపించలేదు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలను ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే. అయితే కొందరు ఈ చూసి పాత గాయాలను రేపడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా వేస్తుంటారు. చరిత్రలో జరిగిన చేదు సంఘటనలను కప్పిపుచ్చి, ఏమీ జరగనట్టుగా వ్యవహరించడం వ్యక్తులకే కాదు ఏ జాతికి మంచిది కాదు. ఆ వికృతులను గురించి తెలుసుకుని , సరిచేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది.

ఆర్టికల్ 370ని కేంద్రం ఎందుకు రద్దు చేసిందని అడిగే వారికి ఈ సినిమా చూస్తే బోలెడన్ని సమాధానాలు దొరుకుతాయి. నటుడిగా మరోసారి తన ట్యాలెంట్ ను చాటుకుని సినిమాకు వెన్నెముకగా నిలిచిన అనుపమ్ ఖేర్ ను, పచ్చి నిజాలను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రిని ప్రత్యేకంగా అభినందించాలి. ఇలాంటి సినిమాలు తీయడానికి నిజాయితీ, నిబద్ధత అవసరం ఉందనే స్థాయిలో వివేక్ నటించాడు. అంతేకాకుండా వాస్తవాలను గుర్తించి కశ్మీర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పైనే ఉందనే పాజిటివ్ దృక్పథంతో ఈ సినిమా ముగియడం కొసమెరుపు.