ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ  

ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతుంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా 3 రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. 3 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెల్పింది.

కాగా సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. దీంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్ లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఢిల్లీలో నేటి నుంచి మరో 6 రోజుల పాటు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ  రానున్న 5 రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెల్పింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నెల 5 నుంచి 9 మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇది రెండో సారి. ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 15 రోజుల్లో 50 గంటల పాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి.