టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లీ
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఇండియన్ టీం కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ పత్రిక దీనికి సంబంధించిన వార్తను ప్రచురించింది.కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకే పరిమితమవుతాడని, వన్డేలు టీ20లో రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ, నేడు కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అక్టోబర్ లో దుబాయ్ లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ఓ సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేశాడు.నిజానికి మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.
ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడన్న అపవాదు తప్ప ఇప్పటి వరకు విరాట్ కెప్టెన్సీపై ఎలాంటి మరకా లేదు. అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం వల్ల తన బ్యాటింగ్ పై దృష్టి సారించలేకపోతున్నాడని, అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ వరకూ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోహ్లీ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను బీసీసీఐ ఖండించినా, నేుడు విరాట్ దానిపై క్లారిటీ ఇచ్చాడు.
టీ20 కెప్టెన్ గా విరాట్ రికార్డు ఇదీ…
ఆడిన మ్యాచ్ లు 47. గెలిచిన మ్యాచ్ లు 27. ఓటమి చవిచూసిన మ్యాచ్ లు 14. రెండు మ్యాచ్ లు టై. మరో రెండు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. టెస్టులు , వన్డేల్లో సారథ్య బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలంటే కొంత బడలిక అవసరమని కోహ్లీ తన ట్వీట్ లో తెలిపాడు. కోహ్లీ స్థానంలో టీ20 జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అయితే బీసీసీఐ దీనిపై నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.