ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం : మంత్రి కేటీఆర్

ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం : మంత్రి కేటీఆర్

సాఫ్ట్ పాత్ సిస్టెమ్స్ వార్షికోత్స‌వంలో మంత్రి కేటీఆర్
ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం
ప‌క్క‌నున్న పేద దేశాల‌తో కాదు
తెలంగాణ అత్యంత ప్రామాణికమైన స్టార్ట్ అప్ స్టేట్‌
ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరణ
రాబోయే 5 ఏళ్ల ల్లో 50 వేల ఉద్యోగాలు
టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదు
కులం, మ‌తం, రాజ‌కీయాలు, చిచ్చు కాదు చిచ్చ‌ర పిడుగుల్లా ఎదుగుదాం
ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి
ప్ర‌తిభావంతుల‌కు అండ‌గా తెలంగాణ‌ ప్ర‌భుత్వం
టీ హబ్, టాస్క్‌, వీ హ‌బ్‌లను వినియోగించుకోండి
సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు ప్ర‌తిభ ఉన్న వాళ్ళ వ‌ద్ద‌కే ఉద్యోగాలు

ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం : మంత్రి కేటీఆర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఇంకెంత కాలం ప‌క్క‌నున్న దేశాల‌తో కుస్తీలు ప‌డ‌దాం… ఇక‌నైనా ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం. ప్ర‌పంచ దిగ్గ‌జ ఐటీ కంపెనీల సిఇఓలంతా మ‌న వాళ్ళే. మ‌రి మ‌న‌మెందుకు ఆ స్థాయి కంపెనీల‌ను స్థాపించ‌లేక‌పోతున్నాం. మ‌న మేధ‌కు ప‌ద‌ను పెడ‌దాం. క‌సిగా వాటిని సాధించుకుందామని అని ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ‌ల మంత్రి కేటీఆర్ ఐటీ ఉద్యోగులు, ఔత్సాహిక టెకీల‌కు ఉద్బోధించారు. యేడాది క్రితం హ‌నుమకొండ‌లో స్థాపించి 253 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌కు స్థానికంగా ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పిస్తున్న సాఫ్ట్ పాత్ సిస్టెమ్స్ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఆ కంపెనీని సంద‌ర్శించారు. ఆ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడి ప్రేర‌ణాత్మ‌క ఉప‌న్యాసాన్ని ఇచ్చారు. అంద‌రిలోనూ కొత్త ఆలోచ‌న‌లు మొల‌కెత్తేలా ఆలోచ‌నాత్మ‌క సందేశాన్ని అందించారు.

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ 75 ఏళ్ల తర్వాత కూడా 138 కోట్ల జనాభా ఉన్న మ‌నం, 1.38ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తున్న‌ యాపిల్ స్థాయి ఒక ఐటీ కంపెనీని స్థాపించ‌లేక‌పోయాం. చైనా బూచీ చూసి, చూపే వాళ్ళ‌ని చూసి భ‌య‌ప‌డే మ‌నం, చైనా సాధించిన జిడిపిని సాధించ‌లేక‌పోతున్నాం. త‌మాషా ఏంటంటే… 1987 లో ఇండియా చైనా జిడిపి 470 మిలియ‌న్ డాలర్లు, ఇప్పుడు మ‌న జిడిపి 3 ట్రిలియన్ డాలర్లు, అదే చైనా జిడిపి 16 ట్రిలియన్ డాలర్లు. 25 ఏండ్ల పాటు డబుల్ డిజిట్ జీడీపీతో చైనా కొనసాగుతున్నది. అంటూ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దాం..
మ‌నం ఇప్ప‌టికీ ప‌క్క‌నున్న దేశాల‌తో పేద‌రికంతో, అక్క‌డి స‌మ‌స్య‌ల‌తోనే పోటీ ప‌డుతున్నాం. అభివృద్ధితో కాద‌ని, ఇక‌నైనా ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌దామని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అత్యంత ప్రామాణికమైన స్టార్ట్ అప్ స్టేట్‌..
త‌న దృష్టిలో దేశంలోనే అత్యంత ప్రామాణిక‌మైన స్టార్ట‌ప్ స్టేట్ తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ సగటు తలసరి ఆదాయం 1.24 ల‌క్ష‌ల కోట్లు 2022లో అది 2.78 ల‌క్ష‌ల కోట్లు అన్నారు. ఇది దేశ త‌ల‌స‌రి ఆదాయం కంటే కూడా చాలా ఎక్కువ అన్నారు. జీఎస్ డీపీ 5.6 శాతం మాత్ర‌మే ఉండే. ఇప్పుడు అది 11 శాతానికి చేరింది. దేశంలో 12వ పెద్ద రాష్ట్రం. కానీ దేశానికి ఆదాయం స‌మ‌కూర్చ‌డంలో 4వ రాష్ట్రం. జ‌నాభాలో 2.5శాతంగా ఉన్న తెలంగాణ‌, దేశానికి 5 శాతం ఆదాయాన్ని అందిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.

ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరణ..రాబోయే 5 ఏళ్ల ల్లో 50 వేల ఉద్యోగాలు
ఐటీ రంగాన్ని హైద‌రాబాద్ కే ప‌రిమితం చేయ‌కుండా, ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తున్నామ‌ని తెలిపారు. రాబోయే 5 ఏళ్ల ల్లో 50 వేల ఉద్యోగాలు అందించాల‌ని నిర్ణ‌యించామని అన్నారు. ఇక ప్ర‌పంచంలో పెద్ద మార్పు వ‌చ్చింద‌ని, ఆఫీసుల నుండి కాకుండా ఇంటి నుండే పని ఈజీ అని తేలింది. ఇక ఐటీ విస్తరణలో పెను మార్పులు వ‌చ్చాయ‌ని, గ్రామాల నుంచి కూడా పని చేసే అవకాశాలు వచ్చాయని మంత్రి తెలిపారు.

టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదు..
మ‌న టాలెంట్ తో ప్ర‌పంచంలోని అన్ని అగ్ర‌శ్రేణి ఐటీ కంపెనీల‌కు మ‌న వాళ్ళే సీఇఓలుగా ఉన్నార‌ని, అటువంట‌ప్పుడు ఆయా స్థాయి కంపెనీల‌ను మ‌న‌మే ఎందుకు స్థాపించ‌కూడ‌ద‌ని ఆలోచించాల‌ని కేటీఆర్ అన్నారు. కులం, మ‌తం, రాజ‌కీయాలు, చిచ్చు ల‌లో కొట్టుకుపోకుండా క‌సితో చిచ్చ‌ర పిడుగుల్లా ఎదుగుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి..
ప్ర‌తిభావంతుల‌కు అండ‌గా తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఉన్న‌వాటిలో ప‌ని చేయ‌డం కాదు. ఇక ఇన్న‌వేష‌న్ మీద దృష్టి సారించాల‌ని కెటిఆర్ అన్నారు. అందుకు త‌గిన ప్ర‌తిభ మ‌న‌లోనే ఉంది. కానీ, ఆలా ఆలోచించ‌డం లేద‌ని అన్నారు. ప్ర‌తిభావంతుల‌కు అండ‌గా తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

టీ హబ్, టాస్క్‌, వీ హ‌బ్‌లను వినియోగించుకోండి..
సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు ప్ర‌తిభ ఉన్న వాళ్ళ వ‌ద్ద‌కే ఉద్యోగాలు వ‌చ్చే విధంగా చూసే బాధ్య‌త మాది. మ‌న తెలంగాణ‌లో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా ఏర్పాటు చేసిన‌, టీ హ‌బ్‌, వీ హ‌బ్‌, టాస్క్ ల‌ను వేదిక‌లుగా చేసుకోండి. కొత్త ఆలోచ‌న‌ల‌తో రండి. వాటిని సాకారం చేసుకుని పొండి అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

వ‌రంగ‌ల్ లో త్వ‌ర‌లోనే 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ స్టార్ట్ చేస్తాం. ఇప్ప‌టికే సియాంట్‌, జెన్ ప్యాక్ వంటి అనేక కంపెనీలు వ‌స్తున్నాయి. ఇంకా స‌దుపాయాలు క‌ల్పిస్తాం. ఇక్క‌డే కొత్త కంపెనీల్లో మ‌న కొత్త త‌రం పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉండే అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని మంత్రి తెలిపారు. సాఫ్ట్ పాత్ ఆద‌ర్శంగా మ‌రిన్ని కంపెనీలు రావాల‌ని, ఇందులో ప‌ని చేసే వాళ్ళు కూతా కొత్త ఆలోచ‌న‌ల‌తో ఎద‌గాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

సాఫ్ట్ పాత్ కొత్త‌గా ఎదిగే వాళ్ళ‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. అత్యంత సాదాసీదాగా ప్రారంభించి, అత్యున్న‌తంగా ఎదిగిన ఆ కంపెనీ సీఇఓ ర‌విచంద్ర‌ను అభినందించారు. వారి కుటుంబ నేప‌థ్యాన్ని చెప్పి, అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, మేయ‌ర్‌, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప‌లువురు ప్ర‌ముఖులు త‌దిత‌రులు పాల్గొన్నారు.