రాహుల్ అజ్ఞాని.. గాంధీ భవన్ లో గాడ్సే : కేటీఆర్

రాహుల్ అజ్ఞాని.. గాంధీ భవన్ లో గాడ్సే : కేటీఆర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని రాహుల్ గాంధీ నిన్నటి వరంగల్ సభలో మాట్లాడిండు అని కేటీఆర్ గుర్తు చేస్తూ, గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పజెప్పావని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకున్న వ్యక్తికి అప్పజెప్పావని ఎద్దేవా చేశారు. నీవు ఏం తెల్వనోనివి, రాసిస్తే చదివి పోయే వ్యక్తివని విమర్శించారు. అభం శుభం తెలియని అమాయకుడివి అజ్ఞానివి, అంతకే ఉంటే మంచిదని రాహుల్ ను కేటీఆర్ హెచ్చరించారు.రాహుల్ అజ్ఞాని.. గాంధీ భవన్ లో గాడ్సే : కేటీఆర్

కాంగ్రెస్ అంటేనే స్క్యాంగ్రెస్..
ఇక టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోని సంబంధం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. మాకు ఇతర పార్టీలకు బీ టీం, సీ టీం అయ్యే దౌర్భాగ్యం పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్. తొత్తులుగా ఉండే అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్క్యామ్ గ్రెస్ అని విమర్శించారు. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే, పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కుంభకోణాల్లో కూరుకుపోయిన అసమర్ధమైన పాలన అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఓటుకు నోటు దొంగను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రిమోట్ కంట్రోల్ పాలనలో ఉందని రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సీఎం రాజు అయితే, నీ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయటే తిరిగేవాడా ? యువరాజు అని నిన్ను పిలుస్తారు. నీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత నువ్వు, రాజరికం మాదిరిగా ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి రాజులు అని మాట్లాడటం సరికాదన్నారు.

ఒకవేళ కేసీఆర్ నియంత అయితే , పొద్దునే లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్ పెట్టుకునే వారు ఇక్కడే ఉండేవారా ? ఈ ఆటలు సాగుతాయా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను క్షమించమని అంటడు, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోం అని అంటుండు. ఈ దేశంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే వారు లేరు. అమేథిలోనే గెలవలేవు. నువ్వు తెలంగాణకు వచ్చి పీకి పందిరి వేస్తావా ? అని రాహుల్ ను కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.