పోలీసులపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

పోలీసులపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఏపీ పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని లోకేశ్ అన్నారు. పోలీసులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి కొమ్ముకాస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ తొత్తులుగా మారిన పోలీసులు, ప్రశ్నించే ప్రజలు- ప్రతిపక్ష టీడీపీ నేతలపై దాడులకి తెగబడ్డారని ఆరోపించారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు చివరికి వైసీపీ మూకలకు బాధితులు అవుతున్నారని వాపోయారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యాని పెట్టుకుని పార్టీ చేసుకోవడం అధికార పార్టీ నేతల బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. సీఐతో మంత్రి సీదిరి అప్పలరాజు దురుసు ప్రవర్తన, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎంపీ నందిగం సురేష్ రౌడీ మూకల దాడి దారుణం అన్నారు. పోలీసులకే రక్షణ లేని రాష్ట్రంలో ప్రజలను కాపాడేదెవరు? అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే..
విశాఖపట్నంలోని మాకవరపాలెం దాబాలో కొందరు వ్యక్తులు మద్యం తాగి వీరంగం చేశారు. దీంతో స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా.. అక్కడి వ్యక్తులు పోలీసులను లెక్క చేయకుండా బిర్యానీ, వాటర్ బాటిల్‌ను కానిస్టేబుట్ బైక్ పై పెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోంది. సీఐపై మంత్రి చీదర పని, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌పై ఎంపీ సురేష్ రౌడీ మూకల దాడి.. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజలను కాపాడేదెవరు..?’ అని నారా లోకేశ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఈ మేరకు ఆ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.

మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకవరపాలెం ఆర్ఆర్ రెస్టారెంట్ లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి వీరంగం చేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మద్యం సేవించి ఉన్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే మందుబాబులు పోలీసులపైనే తిరగబడ్డారు. పోలీసులతో గొడవపడ్డ వారిలో ఒకరు పాకలపాడు వైసీపీ నేత, ఎంపీటీసీ భర్త యళ్ల నాయుడు కాగా, మరొకరు విద్యా కమిటీ చైర్మన్ నానాజీ.

వీరు తప్పతాగి పోలీసులుపైనే వీరంగం సృష్టించారు. పోలీస్ బైక్ ను అడ్డుకుని అసభ్యపదజాలంతో దూషించారు. పోలీసు బైక్ పై కూర్చుని ఉండగానే.. బైక్ సీటుపై బిర్యానీ బాక్స్ పెట్టారు. అంతేకాదు.. మేము అధికార పార్టీ నేతలం, మాకు ఎమ్మెల్యే తెలుసు, మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అంటూ వైసీపీ నేతలు హల్చల్ చేశారు. మాకే ఎదురు చెబుతారా? అంటూ పోలీసుపై తిరగబడ్డారు. దీన్ని స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. పోలీసులను లెక్కచేయని స్థితిలో అధికార పార్టీ నేతలు ఉన్నారని, ఇక సామాన్యుల గతేంటని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.