కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: డబ్బులు ఇచ్చిన వారికే హస్తం పార్టీలో టికెట్లని మంత్రి కేటీఆర్ విమర్శించారు.కూకట్‌పల్లి సీటు కోసం రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారని అన్నారు.రాష్ట్రంలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు.తాను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమవుతోందని ఆరోపించారు.హైదరాబాద్​లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.రాహుల్ గాంధీ లీడర్ కాదని,రీడర్‌ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరతానంటే రేపే వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పారు.అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని విమర్శించారు.

బీజేపీని వారి నాయకత్వమే సీరియస్‌గా తీసుకోవడం లేదని,బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు.కమలం పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని అన్నారు.భారతీయ జనతా పార్టీతో స్నేహముంటే మోడీని ఎందుకు తిడతామని కేటీఆర్ ప్రశ్నించారు.తాము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.రేవంత్‌రెడ్డి అక్రమాలపై ఐటీ,ఈడీ సోదాలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు.తాను జీహెచ్ఎంసీ,సిరిసిల్ల,కామారెడ్డిలో ప్రచారం చేస్తానని చెప్పారు.మేనిఫెస్టోలో రైతులు,మహిళలు,దళితులు,గిరిజనులు,బీసీలు,మైనార్టీలు,పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేయనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు.అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగానే చూస్తామని వివరించారు.

కాంగ్రెస్ 2004, 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.తమకు గతంలో మాదిరిగా 88 సీట్లు రావచ్చని అన్నారు.హుజూరాబాద్‌లో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈటల రాజేందర్ 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదని,వైఎస్‌ షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్​లో చేరుతారని కేటీఆర్ చెప్పారు.కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని ఎద్దేవా చేశారు.హస్తం పార్టీలో ముఖ్యమంత్రి పదవికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందని వివరించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ తెలిపారు.కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకూ ఆందోళన కలిగిందని గుర్తు చేశారు.హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాలనే,ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.