పెళ్లితో ఒక్కటైన మనోజ్-భూమా మౌనికా రెడ్డి
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కారు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మంచు లక్ష్మి ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలు వినిపిస్తున్నప్పటికీ వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు, అధికారికంగా ప్రకటించలేదు. అయితే రీసెంట్ గా తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచు మనోజ్. కాగా మనోజ్ పెళ్లి వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించి మంచు లక్ష్మి. ఈ సందర్భంగా తనే స్వయంగా సోదరుడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసింది.
ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ M WEDS M…MANOJ WEDS MOUNIKA అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే ఈ జంట విభేదాలతో విడిపోయింది. ఇక భూమా మౌనిక గతంలో బెంగుళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ జంట కూడా మనస్ఫర్థల కారణంగా విడిపోయారు.
అయితే మనోజ్ , మౌనికా రెడ్డితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరి వివాహం గురించి అనేక సార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ జంట ప్రేమ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి కొన్ని పుకార్లు వైరల్ అయ్యాయి. మొత్తానికి ఈ పుకార్లకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టింది ఈ నూతన జంట. ఇక మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదనే పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దంపతులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.
మంచు మనోజ్ పెళ్లికి అతని సోదరుడు మంచు విష్ణు దంపతులు, టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు, డైరెక్టర్ బాబీ, సింగర్ సునీత, వెన్నెల కిషోర్, తేజ , బీఎస్ రవి తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించి, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మంచు మనోజ్, మౌనిక వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.