ఒకే వేదికపై సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య

ఒకే వేదికపై సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య

ఒకే వేదికపై సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్యjanakipuramవరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు తెరపడింది. సర్పంచ్ నవ్యపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మీడియాలో, సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈక్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది.

ఈ మేరకే రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లారు. సర్పంచ్ కురుసవల్లి నవ్యతో పాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం జానకీపురం గ్రామానికి రాజయ్య వెళ్లారు. సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు.

క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే రాజయ్య
నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. నాకు నలుగురు అక్కాచెల్లెళ్లున్నారు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా అని ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముందు జరిగిన తప్పులను ఒప్పుకున్నారు. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అని రాజయ్య పేర్కొన్నారు. అంతేకాకుండా జానకీపురం గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ నవ్య, ప్రవీణ్ లను అన్ని రకాలుగా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.

తప్పును ఖండిస్తూనే..క్షమించేసిన సర్పంచ్ నవ్య
నేను చేసిన ఆరోపణలు నిజమని సర్పంచ్ నవ్య తెలిపారు. గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నానని సర్పంచ్ నవ్య మీడియా ముఖంగా తెలిపారు. ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య హెచ్చరిస్తూ చెప్పారు. ఎవరికైనా పార్టీలో విలువలు ముఖ్యమని, ఎక్కడైనా చెడును ఖచ్ఛితంగా ఖండిస్తానని చెప్పారు. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకోవాలని, ఇక మీదట తప్పులు చేయద్దని ఆమె హెచ్చరించారు. సమాజంలో కొందరి చేత అణచివేయబడుతున్న, మోసపోతున్న కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అలాంటి వారికి నేను ముందుండి కొట్లాడుతా అని నవ్య భరోసా ఇచ్చారు.

ఇక ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యానని, అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని ఆమె చురకలంటించారు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోలు పోసి తగలబెట్టడానికైనా వెనుకాడనని ఆమె హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని, ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సర్పంచ్ నవ్య కోరారు.