రాజయ్యపై సుమోటో విచారణకు ఆదేశం
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య పేర్కొంది. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ఇదంతా పార్టీలోని ఇంటి దొంగల పని అని, రాజకీయ కుట్ర అని రాజయ్య తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
ఇక సర్పంచ్ నవ్య వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. దీన్ని సుమోటోగా తీసుకుంది. రాజయ్య పై సర్పంచ్ చేసిన ఆరోపణలు నిజమా, కాదా అనే అంశాలు తేల్చాలంటూ డీజీపీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ లేఖ ద్వారా విచారణకు ఆదేశించారు. ఒకవేళ సర్పంచ్ ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.