హనుమకొండ జిల్లా : చీటికి మాటికి టీఆర్ఎస్ ను దుయ్యబట్టే బీజేపీ నాయకులు గల్లీలో లొల్లి చేయడం మాని, ఢిల్లీలో లొల్లి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చని బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హన్మకొండ సుబేదారిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరెందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలకు బడ్జెట్ కేటాయించాలని, లేని పక్షంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మరో ఉద్యమానికి ముందడుగు వేయడం ఖాయమని దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు.
నాడు కాంగ్రెస్, నేడు బీజేపీది అదే పోకడ : దాస్యం
తెలంగాణకు రైల్వే కొత్త లైన్ల మంజూరులో అన్యాయం జరుగుతుంటే తెలంగాణ బీజేపీ నేతలు గడ్డి పీకుతున్నారా అని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ యూనిట్ కు రాష్ట్ర ప్రభుత్వం 152 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని దాస్యం మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన డెవలప్మెంట్ యూనిట్స్ ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, వరంగల్ జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులపై ఒకే వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ప్రధాని ముందు లొల్లి చేసి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చేయాలని దాస్యం హితవు చేశారు. ఈ సారి రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు మేలు జరుగకపోతే ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారో చూస్తామని చీఫ్ విప్ హెచ్చరించారు.
మీది బ్యాంగిల్స్ పార్టీనా, బీజేపీ పార్టీనా : నన్నపునేని
బీజేపీ లింగ్డో సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని, ఆ దిశగానే తెలంగాణలో అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ, ప్రజలను అడుక్కుతినేలా చేస్తుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. తెలంగాణకు నిధులివ్వకుండా , ఉత్తర భారత్ లోని రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 2 లక్షల 50 వేల కోట్ల నిధులు రావాల్సి ఉండగా, సగంతోనే సరిపెట్టుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కొట్లాది తెచ్చి బీజేపీ పార్టీ అనిపించుకుంటారో లేదా చేతకానితనంతో సరిపెట్టుకుని బ్యాంగిల్స్ పార్టీ అనిపించుకుంటారో బీజేపీ జిల్లా, రాష్ట్ర నేతలు తేల్చుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని ఎద్దేవా చేశారు.