రాష్ట్రంలో 27 నుంచి పీజీ ఫస్టియర్ తరగతులు

రాష్ట్రంలో 27 నుంచి పీజీ ఫస్టియర్ తరగతులుహైదరాబాద్ : తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం తరగతులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభంకానున్నాయి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే రోజు నుంచి తరగతులు మొదలవుతాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలోని కేయూ, ఓయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ ను అమలు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. దీనికి వైస్ ఛాన్స్ లర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది.

పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ మొదటి విడుత కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తికాగా 23,647 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం రెండో విడుత కౌన్సిలింగ్ కొనసాగుతున్నది. పూర్తి అకడమిక్ క్యాలెండర్ ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసి అమలు చేయనున్నట్లుగా సమాచారం.