టైమ్ వేస్ట్ అంటూ.. వెళ్లిన రాహూల్​

టైమ్ వేస్ట్ అంటూ.. వెళ్లిన రాహూల్​న్యూఢిల్లీ : ర‌క్ష‌ణ శాఖ‌పై పార్ల‌మెంట‌రీ ప్యానెల్ బుధ‌వారం నిర్వ‌హించిన స‌మావేశం మ‌ధ్య‌లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ‘అస‌లు విష‌యాల‌పై మాట్లాడ‌టం లేద‌ని, అదొక టైమ్ వేస్ట్’అని రాహుల్ అన్నారు. ఆయ‌నతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, మ‌రో స‌భ్యుడు రాజీవ్ స‌త‌వ్ కూడా ఉన్నారు. స‌రిహ‌ద్దులో ఉన్న సైనికుల‌కు మెరుగైన ఆయుధాలు ఎలా ఇవ్వాల‌న్న‌దానిపై చ‌ర్చించ‌కుండా సాయుధ బ‌ల‌గాల యూనిఫామ్‌పై చ‌ర్చిస్తున్నార‌ని రాహుల్ ఆరోపించారు. ఆ స‌మ‌యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌రల్ బిపిన్ రావ‌త్ కూడా అక్క‌డే ఉన్నార‌ని రాహుల్ చెప్పారు.
బ‌ల‌గాల యూనిఫామ్‌పై ప్యానెల్ చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో రాహుల్ జోక్యం చేసుకొని ఇది సీనియ‌ర్ డిఫెన్స్ అధికారులు నిర్ణ‌యం తీసుకునే అంశ‌మ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉన్న సైనికుల గురించి చ‌ర్చించాల‌ని రాహుల్ ప‌ట్టుబ‌ట్ట‌గా ప్యానెల్ చైర్మ‌న్‌, బీజేపీ ఎంపీ జువ‌ల్ ఓర‌మ్ ఆయ‌న‌ను మాట్లాడ‌నీయ‌లేదు. రాజ‌కీయ నాయ‌క‌త్వం అనేది దేశ భ‌ద్ర‌త‌, బ‌ల‌గాల‌ను ఎలా బ‌లోపేతం చేయాల‌న్న అంశాల‌పై చ‌ర్చించాలి అని రాహుల్‌గాంధీ అన్న త‌ర్వాత ఆయ‌న‌కు జువ‌ల్ ఓర‌మ్ అడ్డుప‌డ్డారు. దీంతో రాహుల్ స‌మావేశం మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చారు.