గన్నవరం ఘటనపై సజ్జల కీలక వ్యాఖ్యలు !
వరంగల్ టైమ్స్, గన్నవరం : రాష్ట్రంలో సంచలనంగా మారిన గన్నవరం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఘటనను తాము సమర్ధించటం లేదన్నారు. కానీ, అసలు ఘటనకు కారకులెవరు, రెచ్చగొట్టింది ఎవరో ఆలోచన చేయాలని సూచించారు. అక్కడకు వంశీ వెళ్లకపోవటమే సంయమనం పాటించటమని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించామని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రచారం కోసం టీడీపీ తాపత్రయ పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండ్రోజుల క్రితం గన్నవరంలో చోటు చేసుకున్న ఘటనలు, జరుగుతున్న ప్రచారం పైన సజ్జల స్పందించారు. నాలుగు రోజులుగా మాటలు జరుగుతూనే ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు – లోకేష్ ను గన్నవరంలో పోటీ చేయమని వంశీ వ్యాఖ్యానిస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. విజయవాడలో ఉండే పట్టాభి గన్నవరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
పోలీసులు టీడీపీ హయాంలో ఉన్నట్లు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని సజ్జల పేర్కొన్నారు. వాళ్ళే అరాచకాలు సృష్టించి మా పార్టీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా పట్టాభిని చంద్రబాబు అన్ని రకాలుగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఏ ఒక్కరూ పట్టాభికి మద్దతుగా లేరన్నారు.