ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లపై కేంద్రం కీలక ఆదేశాలు 

ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లపై కేంద్రం కీలక ఆదేశాలు

ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లపై కేంద్రం కీలక ఆదేశాలు 

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు వయస్సు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు ఐదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. విద్యలో సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే లక్ష్యమంటూ కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానం (NEP)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

10+2 విధానానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన 5+3+3+3 విధానం ప్రకారం చిన్నారులకు ఆరేళ్ల వయసులో ఒకటో తరగతి మొదలవుతుంది. మూడు నుంచి ఎనిమిదేళ్ల మధ్య చిన్నారులందరికీ ఫౌండేషన్ దశలో భాగంగా విద్యను అందిస్తారు. ఇందుకు గాను మూడేళ్ల పాటు ప్రీ స్కూల్, ఆ తర్వాత 1, 2వ తరగతుల్లో చిన్నారులు అభ్యసించాల్సి ఉంటుంది. మూడేళ్ల వయసులో పిల్లలను స్కూళ్లకు పంపడం వల్ల మంచి పునాది పడటంతో ప్రీ స్కూల్ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో లెర్నింగ్ ప్రక్రియ అలవడుతుందని తెల్పింది.

అలాగే అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో చేరడానికి ముందే నాణ్యమైన విద్యను మూడేళ్ల పాటు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని సదరు అధికారి అన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న వయసు నిబంధనను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు.