సార్ సినిమాకు సలాం కొట్టాల్సిందే..

సార్ సినిమాకు సలాం కొట్టాల్సిందే..

సార్ సినిమాకు సలాం కొట్టాల్సిందే..వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్: ధనుష్ నటించిన, వెంకీ దర్శకత్వంలో విడుదలైన “సార్” మూవీ అద్భుతంగా ఉంది. ఉపాధ్యాయుడు అంటే చులకనగా చూసే విద్యార్థులకు, ఉపాధ్యాయుడు లేనిదే అక్షరం నేర్చుకోలేమని తెలుసుకోలేని కొంతమందికి “సార్” సినిమా చూస్తే కాస్తైనా జ్ఞానోదయం కల్గుతుందని చెప్పవచ్చు. నేటి సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో. విద్యార్థికి చదువు ఎంత కీలకమో, దానికి “కీ” లాంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అని చూపించారు. ఉపాధ్యాయుని ద్వారా ఇచ్చే ప్రత్యక్ష విద్య మాత్రమే కీలకమని చూపించారు. ఆధునికీకరణ యుగంలో సాంకేతిక విద్య ఉన్నప్పటికీ ఉపాధ్యాయుని పాఠాల ముందు సాంకేతిక విద్య రాదు అనే అంశాన్ని ప్రత్యేకంగా చూపించారు.

ఉపాధ్యాయుల పట్ల నేటి విద్యార్థులు ఎలా ఉండాలో హృదయాలను కట్టిపడేసినట్లు చూపించారు. ఇక ఈ సినిమా చూస్తుంటే థియేటర్లో కూర్చున్నామా! లేదా పాఠశాలలో కూర్చున్నామా! అన్న భావన కలుగుతుంది. సినిమాలలో ఉపాధ్యాయుడిని ఎలా చూపించకూడదో అలాంటి సినిమాలు ఇంతవరకు చూశాము. “బడిపంతులు” అనే సినిమా ద్వారా ఒక గొప్ప ఉపాధ్యాయ పాత్రని పాత తరం చూసినట్లే…నేటి కొత్త తరం “సార్” సినిమా ఖచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా.

ఉపాధ్యాయుడు నేటి సమాజానికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి నైతిక విలువలతో కూడిన విద్య పొందాలి. నేటి సమాజం అత్యంత విలువ ఇవ్వాల్సిన వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే ఆ తర్వాతే ఎవరైనా అనే అంశాలను చూపించిన సినిమా ఇది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ఎంత గౌరవభావాన్ని కలిగి ఉంటే అంతటి చక్కని విద్య సాకారం అవుతుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. విద్యార్థుల పసితనాన్ని, ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని, అత్యద్భుతంగా చూపించిన వెంకీ అట్లూరి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాదు వరంగల్ టైమ్స్ తరపున “సార్” సినిమాకు సలాం.