టీడీపీ కొత్త అస్త్రం : వల్లభనేని వంశీకి చెక్..!?

టీడీపీ కొత్త అస్త్రం : వల్లభనేని వంశీకి చెక్..!?

టీడీపీ కొత్త అస్త్రం : వల్లభనేని వంశీకి చెక్..!?

వరంగల్ టైమ్స్, గన్నవరం : ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వేడి పెరిగింది. సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రతీ సీటు కీలకం అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంతో పాటుగా క్రిష్ణా జిల్లాలో “ఆ ఇద్దరు మాత్రం గెలవకూడదని పదే పదే చెబుతున్నారు. అందులో గన్నవరం లో వల్లభనేని వంశీ ఒకరు. ఇప్పటికే అక్కడ వైసీపీ ముఖ్య నేతలు వంశీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం వంశీకి టికెట్ ఖాయమని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అక్కడ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వంశీ వ్యతిరేక వైసీపీ నేతలు వంశీకి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయాల దిశగా అడగులు వేస్తున్నారు.

*వంశీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ఆ ఇద్దరూ
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. దీంతో జిల్లా టీడీపీ నేతలకు కొడాలి నానితో పాటుగా వంశీ కూడా టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో గన్నవరంలో వైసీపీ నేతలుగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఇద్దరూ వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు.

వంశీ పార్టీకి దగ్గరైన సమయం నుంచి ఆ ఇద్దరి మద్దతు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీ మాత్రం వీటిని సీరియస్ గా తీసుకోవటం లేదు. వైసీపీ అధినాయకత్వం తనకు మద్దుతుగా ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే మరోసారి యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు భేటీ అయ్యారు. వంశీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వెంకటరావు కొత్తగా రాజకీయ కార్యాలయం ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

*వైసీపీ అభ్యర్ధిగా వంశీ ఖరారు..
వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్దిగా వల్లభనేని వంశీ పేరును వైసీపీ దాదాపు ఖరారు చేసింది. పార్టీ జిల్లా సమన్వయకర్త మర్రి రాజశేఖర్ తో పాటుగా అధినాయకత్వం ఈ వ్యవహారంపైన స్పష్టత ఇచ్చింది. వంశీకి వ్యతిరేకంగా ఉన్న వెంకటరావును కలిసి పని చేసుకొనే సంకేతాలు ఇస్తూ గతంలో క్రిష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ వంశీ – వెంకటరావు చేతులు కలిపారు.

ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ వంశీకి వ్యతిరేకంగా ఇద్దరు నేతలు సమావేశం కావటం నియోజకవర్గంలో మరోసారి చర్చకు కారణమవుతోది. ఇదే సమయంలో టీడీపీ నుంచి ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ టీడీపీ అభ్యర్ధిగా గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వంశీని ఓడించటమే లక్ష్యంగా భావిస్తున్న టీడీపీ, వంశీని వ్యతిరేకిస్తున్న వైసీపీ ఇద్దరు నేతల్లో తమకు సహకరించే వారు ఎవరనే దాని పైన ఫోకస్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

*స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి వెంకటరావు..?
వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఖరారు చేయటం ఖాయం. గత ఎన్నికల్లో వంశీకి వ్యతిరేకంగా పని చేసి ఇప్పుడు అనుకూలంగా పని చేయటం సాధ్యం కాదని వెంకటరావు, రామచంద్రరావు స్పష్టం చేస్తున్నారు. హైకమాండ్ నిర్ణయంలో మార్పు లేకుంటే, వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగాలని నిర్ణయించారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వంశీకి వ్యతిరేకంగా ఉన్న వారిని తమకు అనుకూలంగా మలచుకొనే పని టీడీపీ నేతలు ప్రారంభించారని తెలుస్తోంది.

వెంకటరావు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే టీడీపీకి అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా టీడీపీ అధికారంలోకి వస్తే వంశీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఇస్తారనే విధంగా ఆఫర్లు సిద్దం అవుతున్నాయి. దీంతో, గన్నవరం విషయంలో వైసీపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది.ఆ ఇద్దరిని ఎలా నియంత్రిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.