నేటి నుంచి అందుబాటులోకి వందేభారత్
వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : నేటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్న వందే భారత్ రైలుకు ఆంధ్రపదేశ్ లో 3 హాల్టులు, తెలంగాణ లో 3 హాల్టులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నంలో బయలు దేరే రైలు రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. ఆ తర్వాత తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో హాల్టులతో సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు సైతం ఇవే హాల్టులతో విశాఖపట్నం చేరుతుంది.తొలి స్వదేశీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నడుమ పరుగులు తీయడం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపి వందే భారత రైలును ప్రారంభించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, తెలంగాణ మంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023 కొత్త సంవత్సరంలో ప్రారంభించిన మొదటి వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు ఇస్తున్న కానుక అని ప్రధాని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు.