లోయలో టూరిస్ట్ బస్సు బోల్తా 

లోయలో టూరిస్ట్ బస్సు బోల్తా

వరంగల్ టైమ్స్, చిత్తూరు జిల్లా : ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతం నుంచి శనివారం బయల్దేరి వస్తున్న టూరిస్ట్ బస్సు బకారాపేట వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సు 300 అడుగుల లోతున పడిపోవడంతో డ్రైవర్ తో పాటు 10 మంది మరణించినట్లు తెలుస్తున్నది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ్లి కొడుకు బంధువులు ఈ బస్సులో వస్తున్నారు. బస్సులో పెండ్లి కొడుకు వేణుతో పాటు 50 మంది కూడా ఉన్నారని సమాచారం. పెండ్లి కొడుకుతో పాటు మరో 10 మంది పరిస్థితి విషమించిందని తెలుస్తున్నది. వీరిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

అకస్మాత్తుగా బస్సు లోయలో పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుకోకుండా బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు షాక్ కు గురై స్పృహ కోల్పోయారు. 3 అంబులెన్స్ లు, ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమాచారం తెలియగానే తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రివేళ చిమ్మచీకట్లతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు తమ వద్ద ఉన్న టార్చి లైట్లతోనే బస్సులో వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.