కూలిన పర్యాటకుల విమానం..7గురు మృతి

కూలిన పర్యాటకుల విమానం..7గురు మృతివరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలో టేకాఫయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకెళ్తుండగా, నాజ్కలోని వైమానిక కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, పైలట్, కోపైలట్ ఉన్నట్లు తెలిపారు. ఆ విమానం ఏరో శాంటోస్ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు.

పెరూలో నాజ్కా లైన్లు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1500 – 2000 యేళ్ల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్కక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్ ఫీల్డ్ నుంచి ప్రతీ రోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు. 2010, అక్టోబర్ లో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటీష్ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్ విమాన సిబ్బంది మరణించారు.