వరంగల్ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పెండింగ్ లో వున్న పలు అభివృద్ధి పనులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. వరంగల్ నగరంలోని దూపకుంటలో 1400 రెండు పడకల గదుల నిర్మాణ పనులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. అసంపూర్ణంగా వున్న రెండు పడకల గదుల నిర్మాణ పనులను దసరా వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ 15 రోజులకొకసారి ప్రగతిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ఆర్. అండ్.బి ఇ.ఇ. కి ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణంలో సమస్యలుంటే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వెల్లడించారు. కాంపౌండ్ వాల్ ప్రతిపాదన లేనందున వెంటనే అంచనా లు తయారు చేయాలని, అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే నరేందర్ అధికారులను కోరారు. అనంతరం భట్టుపల్లి బైపాస్ రోడ్డులో గతంలో రాజీవ్ గృహకల్ప అసంపూర్తి భవనాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పరిశీలించారు. గతంలో నిరుపేదల కోసం నిర్మించిన 734 గృహాల పరిశీలన భవనాల వాయోబిలిటి కన్సల్టెంట్ తో పరిశీలించాలని అర్.అండ్.బి., ఇ.ఇ. కి ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ ప్రాంతంలో అసాంఘిక చర్యలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని ప్రతి రోజు పరిశీలన చేయాలని పోలీసులను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు.