ఏఈ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీఓ) పరీక్ష సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో ఏఈ పోస్టులకు సంబంధించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఏఈ పోస్టులకు సంబంధించి పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు తెల్పింది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని 837 అసిస్టెం ఇంజినీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 5న పరీక్ష జరుగగా, 55వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిశితంగా గమనించిన తర్వాత పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ తెల్పింది.