టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుచిత్తూరు జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానం మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నది. ప్రపంచంలోని ఏ ఇతర ఆలయం అందించని విధంగా భక్తులకు సేవలందిస్తున్న టీటీడీ సేవలను ఇంగ్లండ్ కి చెందిన ఓ సంస్థ గుర్తించింది. టీటీడీ సేవలకు గుర్తింపుగా ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ బహుకరించింది.

శనివారం తిరుమలలోని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయిన ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయనకు ధ్రువీకరణపత్రం అందచేసి అభినందించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీటీడీ భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తున్నదని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియా ద్వారా తెలిపారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్వహణ జరుగుతున్నదని సుబ్బారెడ్డి తెలిపారు. నిత్యం 3.5 లక్షల లడ్డూలు భక్తులకు పంపిణీ చేసేందుకు మంచి వాతావరణంలో తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.