కృష్ణా నదిలో ఈతకెళ్లి విద్యార్థులు మృతి

కృష్ణా నదిలో ఈతకెళ్లి విద్యార్థులు మృతిగుంటూరు జిల్లా : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

శ్వేత శృంగాచలం వేద పాఠశాల విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థుల కుటుంబసభ్యులకు హోంమంత్రి సుచరిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.

విద్యార్థుల మృతి పట్ల ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ , గవర్నర్ బిశ్వభూషణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులను హర్షిత్ శుక్లా, అన్షుమన్ శుక్లా, శుభమ్ త్రివేది, నితేష్ కుమార్, దీక్షిత్, శివ శర్మగా గుర్తించారు.

వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.