పంట నష్టం జరిగిన ప్రతీ రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే చల్లా

పంట నష్టం జరిగిన ప్రతీ రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే చల్లాహనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టం జరిగిన ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు. సంక్రాంతి పర్వదినాన తిరుపతిలో ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోయిన చల్లా ధర్మారెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సంబంధిత అధికారులను శుక్రవారం రోజు అలర్ట్ చేశారు. రైతుల ఆవేదనను తట్టుకోలేక హుటాహుటిన తిరుపతి నుంచి బయల్దేరి వచ్చిన ఎమ్మెల్యే చల్లా శనివారం పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించారు.

రైతులు నష్టపోయిన పంటపొలాల్లో ఎమ్మెల్యే చల్లా సందర్శించారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతికి వచ్చిన పంటలు నేలపాలవ్వడం నేరుగా చూసిన చల్లా ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన తీరును సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంక్రాంతి పండుగ పూట రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడటం దురదృష్టకరమన్నారు.

నష్టం జరిగిన ప్రతీ వ్యవసాయ భూముల దగ్గరకు అధికారులు వస్తారని, అధికారులతో రైతులు సమన్వయ చేసుకొని నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని రైతులకు న్యాయం చేసేలా చూస్తామని ఎమ్మెల్యే చల్లా హామీ ఇచ్చారు. కౌలురైతులు అప్పుచేసుకొని పంట మీద పెట్టుబడి పెట్టారని వారికి కూడా న్యాయం చేకూర్చేలా అండగా నిలుస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వలన నష్ట పోయిన రైతులకు పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. మిర్చి పంట పెట్టిన రైతులు అధికంగా నష్ట పోయారని అన్నారు. గ్రీన్ హై వే ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని కేంద్రం ప్రభుత్వంను కోరడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లే భిక్షపతి, పరకాల ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల, నడికూడ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ లు, సంబంధిత అధికారులు, టీఆర్ఎస్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.