కేంద్రమంత్రి అయ్యే యోగం ఎవరికుంది? 

కేంద్రమంత్రి అయ్యే యోగం ఎవరికుంది?

కేంద్రమంత్రి అయ్యే యోగం ఎవరికుంది? 

 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై సీరియస్ గా దృష్టి సారించింది. తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుతాయన్న వార్తల నేపథ్యంలో కమలం పెద్దలు మరింత అలర్ట్ ఐనట్లు సమాచారం. త్వరలోనే కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈ లిస్టులో తెలంగాణ కూడా ఉందని టాక్.

తెలంగాణ నుంచి నలుగురు లోక్ సభ ఎంపీలుండగా, సీనియర్ నేత లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అందులో కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో ఈఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పునర్ వ్యవస్థీకరణలో రాష్ట్రం నుంచి ఒకరు లేదా ఇద్దరికీ చోటు దక్కవచ్చని సమాచారం. ఈ రేసులో లోక్ సభ నుంచి సోయం బాపురావు, రాజ్యసభ నుంచి లక్ష్మణ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

*లక్ష్మణ్ ఎంపికతో బీజేపీకి తెలంగాణ కలిసి వస్తుందా!
లక్ష్మణ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీలన్నీ బలంగా బీసీవాదం వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రేసులో మరింత ముందుకు సాగేందుకు బీజేపీ, లక్ష్మణ్ కు ప్రమోషన్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ ఓడిపోయినప్పటికీ అధిష్టానం ఆయన సమర్థతను గుర్తించి రాజ్యసభను పంపించింది. అంతేకాకుండా ఓబీసీ మోర్చా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సేవలను మరింత వినియోగించుకునేందుకు ఆయనను మోదీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

లక్ష్మణ్ ఎంపిక తెలంగాణ బీజేపీ మరింత బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్. అలాగే లక్ష్మణ్ కు కేంద్రమంత్రిగా అవకాశమిస్తే, తెలంగాణ నుంచి ఆశావహులుగా ఉన్న ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుని సీనియర్ అయిన లక్ష్మణ్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్చొచ్చన్న వాదన వినిపిస్తోంది.

*పోడు సమస్య..బాపురావుకు ఛాన్స్ కల్పిస్తుందా!
ఇక మోదీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఎంపీ సోయం బాపురావుకు కూడా ఛాన్స్ దక్కవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఉంది. కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇది కీలక అంశంగా మారే అవకాశముంది. దీంతో ఎస్టీ వర్గానికి చెందిన సోయం బాపురావుకు ప్రమోషన్ ఇచ్చి, ఆవర్గం ఓట్లను ఆకట్టుకునే స్కెచ్ వేస్తున్నారట బీజేపీ పెద్దలు. బాపురావుకు కేంద్రమంత్రి పదవి ఇస్తే ఉత్తర తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్టీలు బీజేపీ వెంట ఉంటారని బీజేపీ హైకమాండ్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో బాపురావుకు కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.

*వీళ్లకు మాత్రం తక్కువ ఛాన్సే..
మరోవైపు ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అర్వింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వారిద్దరికీ తక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను మార్చే అవకాశాలు ఇప్పట్లో లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బండి సంజయ్ కి కేంద్రమంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అలాగే అర్వింద్ కు కూడా అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే బీసీలకు ఇప్పటికే బీజేపీ హైకమాండ్ పలు కీలక పదవులు ఇచ్చింది. కాబట్టి అదే బీసీ వర్గానికి చెందిన అర్వింద్ కు మినిస్ట్రీ యోగం లేదని టాక్.

*ఆ ఇద్దరిలో ఒకరికైతే ఆ పదవి ఖాయం..
ఇలా ఏరకంగా చూసినా లక్ష్మణ్,సోయం బాపురావులో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారట. అన్నీ లెక్కలు బేరీజు వేసుకుంటున్నారట. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరికి మినిస్ట్రీ యోగం ఖాయమని తెలుస్తోంది. ఎవరికి ఛాన్స్ వచ్చినా ఆ ప్రభావం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.నిజంగానే తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి దక్కితే అది బీజేపీకి కలిసిరావడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి లక్ష్మణ్ కేంద్రమంత్రి అవుతారా? లేక సోయం బాపురావు హిట్ కొడతారా?అన్నది వేచి చూడాలి.!!