రాజీనామా చేస్తా.. అనుమానమే లేదు: జగ్గారెడ్డి

రాజీనామా చేస్తా.. అనుమానమే లేదు: జగ్గారెడ్డివరంగల్ టైమ్స్, హైదరాబాద్: సంగారెడ్డి తూర్పు ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అసంతృప్తి గళాన్ని వినిపించాడు. పార్టీ నుంచి తప్పుకోవాలన్న ఆయన నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో అతనికి సన్నిహితం కలువడం లేదని ఆయన అనుచరులు తనను టీఆర్ఎస్ కోవర్టుగా దుష్ప్రచారం చేస్తున్నందున మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తానంటూ శుక్రవారం రాత్రి జగ్గారెడ్డి ప్రకటించారు.

పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి లేఖలు కూడా రాసినట్లు సమాచారం. జగ్గారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేయగానే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. తన రాజీనామా అంశంపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజే రాజీనామా చేద్దామనుకున్నానని, అయితే రాజీనామా వద్దని సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆపారని జగ్గారెడ్డి తెలిపారు. రానున్న రెండు, మూడ్రోజుల్లో రాజీనామా చేస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.