ఇబ్రహీంపట్నంపై అన్ని పార్టీల కన్ను! 

ఇబ్రహీంపట్నంపై అన్ని పార్టీల కన్ను!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై ప్రధాన పార్టీలన్నీ కన్నేశాయి.ఈసారి ఇక్కడ పాగా వేసేందుకు ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈసారి ఇబ్రహీపట్నం సీటును కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి.ఇబ్రహీంపట్నంపై అన్ని పార్టీల కన్ను! 

* 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినా..ప్రజలను ఆకట్టుకునేందుకు కృషి
ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారాయన. గత ఎన్నికల్లో ఆయన గెలిచినప్పటికీ తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి దాదాపు గెలిచినంత పనిచేశారు. అయినప్పటికీ వందల ఓట్లతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచి, మమ అనిపించారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగానూ ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. ఇటీవల ప్రగతి నివేదన యాత్రను చేపట్టి, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

*వ్యతిరేకతను పోగొట్టేందుకు మంచిరెడ్డి బుజ్జగింపులు
మంచిరెడ్డి కిషన్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత అయితే ఉంది. అందుకే ఈసారి సీఎం కేసీఆర్ బొమ్మనే ఆయన నమ్ముకుంటున్నారని టాక్. కేసీఆర్ ను చూసి ఓటేయాలి తప్ప కిషన్ రెడ్డి చూసి ఓటేసేందుకు జనం సిద్ధంగా లేరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు మంచిరెడ్డి ప్లానింగ్ చేసుకుంటున్నారట. నియోజకవర్గంలో గట్టి ఓటు బ్యాంకు ఉన్న సామాజికవర్గాలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

*హస్తం వర్గపోరు వీడితే..మల్ రెడ్డికే మంచి ఛాన్స్ ..
ఇక కాంగ్రెస్ నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కష్టం కాదంటున్నారు హస్తం శ్రేణులు. ఆయనకు ముందే టికెట్ ఇచ్చి ఉంటే 2018 ఎన్నికల్లోనే రంగారెడ్డి మంచి ఫలితాన్ని సాధించేవారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ పై చివరి దాకా క్లారిటీ ఇవ్వలేదు. చివరి క్షణంలో టికెట్ సాధించినప్పటికీ , మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఓడించినంత పని చేశారు రంగారెడ్డి. దీంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి వచ్చిందని టాక్. రంగారెడ్డికి ఈసారి కలిసొచ్చే అంశం ఏంటంటే ఇక్కడ్నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి కోమటిరెడ్డి తోడైతే కాంగ్రెస్ కు తిరుగుండదన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లో వర్గ పోరు మల్ రెడ్డి రంగారెడ్డిని టెన్షన్ పెడుతోంది.దీని నుంచి గట్టెక్కితే మాత్రం ఆయన సత్తా చాటే అవకాశం కచ్చితంగా ఉంది.

* బీజేపీని లైట్ తీసుకుంటే అంతే సంగతి!
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ కూడా వేగం పెంచింది. కొన్ని గ్రామాల్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఐనప్పటికీ ఎవరు పోటీ చేస్తారో అన్నదానిపై మాత్రం క్లారిటీ అయితే లేదు. బీజేపీ నుంచి సీనియర్ జర్నలిస్టు రాణి రుద్రమ పోటీ చేయవచ్చని టాక్. లేకపోతే లోకల్ బీజేపీ లీడర్లలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు కూడా పోటీ చేయవచ్చని సమాచారం.క్యాడర్ ఉన్నా లీడర్ లేకపోవడమే ఇక్కడ బీజేపీకి మైనస్. అయినప్పటికీ బీజేపీని కూడా లైట్ తీసుకోవడానికైతే లేదు. కలిసొచ్చే రోజు దుమ్ము దులిపే సత్తా బీజేపీకి ఉంది.

*ఏ పార్టీ జెండా ఎగురుతుందో..
ఇలా ఇబ్రహీంపట్నంలో మూడు పార్టీల మధ్య పోటీ ఉంది.అయితే ప్రధాన పోటీ బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యే ఉండొచ్చని అంచనా. తనపై నెలకొన్న వ్యతిరేకతను అధిగమించి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి సత్తా చాటుతారా? లేక ఈసారి సెంటిమెంటును వాడుకుని మల్ రెడ్డి రంగారెడ్డి హిట్ కొడతారా? లేక రెండు పార్టీలకు షాకిస్తూ బీజేపీ ఇబ్రహీంపట్నంలో జెండా పాతుతుందా? అన్నది వేచి చూడాలి.