వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యహైదరాబాద్ : దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలపై వరకట్న వేధింపులు, చిత్రహింసలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా వరకట్న పిశాచికి హైదరబాద్‌‌లోని మియాపూర్‌లో ఓ మహిళ బలైపోయింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పుడు అడ్డురాని కట్నం పెళ్లయ్యాక ఆమె జీవితాన్ని నాశనం చేసింది. భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచులు చేసే వేధింపులు తాళలేక చావే మేలనుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావని(22) పటాన్‌చెరులోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే పావని ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రావణ్‌ను ప్రేమించింది.

ఏడాది క్రితం ఇరువురు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. శ్రావణ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ మియాపూర్‌లోని ఎస్‌ఎంఆర్‌ మెట్రోపోలీస్‌లో ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి తెల్లాపూర్‌లో విల్లా కొనివ్వాలని, ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పాలంటూ పావనిపై శ్రావణ్ ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచు సైతం అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధించసాగారు. ఈ నేపథ్యంలోనే పావని శనివారం తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే శ్రావణ్ ఫోన్ లాక్కున్నాడు. తాను కోరిన విల్లా, కట్నం ఇచ్చేవరకు ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదని గొడవపడి అనంతరం బయటికి వెళ్లిపోయాడు.

దీంతో మనస్తాపానికి గురైన పావని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని పావని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన చేతిపై భర్త, అత్తమామలు అదనపు కట్నం వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రావణ్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచుల వేధింపుల కారణంగానే తమ కూతురు ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి తండ్రి, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.