పేసర్ మహ్మద్ షమిపై ప్రశంసల వర్షం

పేసర్ మహ్మద్ షమిపై ప్రశంసల వర్షంస్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత్ సీనియర్ పేసర్ మహ్మద్ షమిపై మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, కామెంటేటర్ హర్ష భోగ్లే, వసీం జాఫర్ తదితరులు ప్రశంసలు కురిపించారు. 2013లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మహ్మద్ షమి ఇప్పటి వరకు ఆడిన 55 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను ఔట్ చేయడం ద్వారా షమి ఈ రికార్డును అందుకున్నాడు. ఈ రికార్డుతో భారత్ తరపున టెస్టుల్లో అత్యంత వేగంగా 200ల వికెట్ల మైలురాయిని చేరుకున్న మూడో క్రికెటర్ గా నిలిచాడు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 50 టెస్టుల్లో 200 వికెట్లు తీసి మొదటి స్థానంలో కొనసాగుతుండగా… మరో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 54 టెస్టుల్లో 200 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.

ఇప్పుడు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగిన షమి, దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం షమికి ఇది ఆరోసారి కావడం గమనార్హం.