పేర్ని నానిని కలిసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

పేర్ని నానిని కలిసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

జర్నలిస్టులకు ఇంటిస్థలం, ఇల్లు ఖాయం : మంత్రి పేర్ని నాని
వెటరన్ జర్నలిస్టుల వయోపరిమితిని 40 ఏళ్లకు కుదింపు
సీఎంతో చర్చించాక మిగిలిన సమస్యల పరిష్కారం : మంత్రి పేర్ని నాని

వరంగల్ టైమ్స్, అమరావతి : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించే విషయంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆ మేరకు ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. వీటిపై తగిన ఉత్తర్వులు కూడా వీలైనంత త్వరగా ఇస్తామని మంత్రి చెప్పారు. గత రెండున్నరేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై సోమవారం విజయవాడలో మంత్రి పేర్ని నానిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) బృందం కలిసింది. ఆపై జర్నిలిస్టుల సమస్యలపై మంత్రితో చర్చించింది. పేర్ని నానిని కలిసిన ఏపీయూడబ్ల్యూజే నేతలుఐ.జే.యూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ.సుబ్బారావు, ఉపాధ్యక్షులు కంచల జయరాజ్ మంత్రిని కలిసి సీఎంకి రాసిన సమస్యల పత్రాన్ని అందజేశారు. గత రెండున్నరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ సవివరంగా వివరిస్తూ ఇచ్చిన లేఖను మంత్రి పేర్ని నాని సీఎం జగన్ కు తన లేఖతో పాటు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. కొన్ని సమస్యలపై కమిషనర్ తో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరం అయ్యేలా చూడాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలపై సీఎంతో మాట్లాడిన తర్వాత మరోసారి యూనియన్ ప్రతినిధులకు తెలియజేస్తామని చెప్పారు.

అక్రిడేషన్ జారీలో ఉన్న ఇబ్బందులతో పాటు సంక్షేమ నిధి ఏర్పాటు, ప్రొఫెషనల్ కమిటీల నియామకం, ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యుల నియామకం, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అమలులో ఉన్న సమస్యలు, ప్రమాద బీమా పథకం అమలు చేయాల్సిన ఆవశ్యకత, పాత్రికేయులకు పింఛన్ సౌకర్యం వంటి డిమాండ్స్ తో పాటు ఇతర అనేక సమస్యలను మంత్రి దృష్టికి యూనియన్ నాయకులు తీసుకెళ్లారు. అలాగే కరోనా వైరస్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల పారితోషికం ఇవ్వకపోవడం అంశాన్ని మంత్రితో ప్రధానంగా చర్చించారు.

దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా వెటర్న్ జర్నలిస్టుల అక్రెడిషన్లకు సంబంధించి వయోపరిమితిని 40 ఏళ్లకు కుదించేందుకు అవసరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి సీఎం జగన్ ఆదేశాలతో అధికారికంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఆ శుభవార్త తెలియజేస్తామన్నారు. లోకల్ చానల్స్, చిన్న పత్రికల జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించారు.