అప్పుల భారంతో బ్యాంకు మేనేజరు ఆత్మహత్య

అప్పుల భారంతో బ్యాంకు మేనేజరు ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, జంగారెడ్డిగూడెం పట్టణం : ”పనిచేస్తున్న బ్యాంకులో తోటి సిబ్బందికి తెలియకుండా తప్పులు చేశా. మా నాన్నను ఇబ్బంది పెట్టి బతికుండగానే చంపేశా.. నా భార్య, అన్నల బ్యాంకు చెక్కులను వారికి తెలియకుండా సంతకాలు చేసి ఇచ్చేశా. సుష్మితా క్షమించు. మంచి భర్తను కాలేకపోయా. నాలా ఎవరూ ఇలా అప్పులు చేయకూడదు. నా చావుకు కారణం అప్పుల వాళ్లే. ఆత్మహత్య చేసుకున్న బ్యాంకు మేనేజరు మారిశెట్టి నాగరాజు ఇంటి వద్ద లభించిన లేఖ సారాంశం ఇది”. తలకు మించిన అప్పులు ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాయి. ముక్కుపచ్చలారని చిన్నారులు పెద్ద దిక్కును కోల్పాయాయి. అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని వాటిని కట్టలేక, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.అప్పుల భారంతో బ్యాంకు మేనేజరు ఆత్మహత్యపోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మారిశెట్టి నాగరాజు (35) స్థానిక ఐసీఐసీఐ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నారు. తన అవసరాల నిమిత్తం బయట నుంచి తలకు మించిన అప్పులు తీసుకున్నారు. మరికొందరికి స్వయంగా చేబదులు రూపంలో నగదు ఇచ్చారు. చేబదులుగా ఇచ్చిన నగదు వసూలు కాక, ఇచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర క్షోభ అనుభవించారు. దీంతో తాను పనిచేస్తున్న బ్యాంకులో కొంతమంది ఖాతాదారుల బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చిన నగదును వాడుకున్నారు. తాను చేసిన అప్పులకు లక్షల్లో వడ్డీలు కట్టే క్రమంలో రుణదాతలు ఇబ్బందులకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు తీసుకోగా రూ.1.45 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా బకాయి ఉందంటూ వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరి పేర్లు లేఖలో ప్రస్తావించారు. తనకు బయట వ్యక్తుల నుంచి సుమారు రూ.50 లక్షలు రావాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. తన భర్త చనిపోవటంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కావడం లేదని నాగరాజు భార్య రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

బెట్టింగులే కారణమా?
నాగరాజు మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు అప్పులు చేయడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగులా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజుకు ఎటువంటి వ్యసనాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.