జగిత్యాల బరిలో కవిత ? 

జగిత్యాల బరిలో కవిత ?

జగిత్యాల బరిలో కవిత ? వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన తర్వాత జగిత్యాల జిల్లా పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం పక్కనే ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ కుటుంబసభ్యులు బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల బరిలో నిలిచే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

* ఎమ్మెల్యే సంజయ్ పై నెగెటివ్ ఫీడ్ బ్యాక్..
జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించి, సత్తా చాటారు. కానీ ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ కు వచ్చేసరికి పరిస్థితి మారింది. టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత ఎంపీ బరిలో నిలిస్తే, ఓట్లు ఆశించినస్థాయిలో పడలేదు. దాంతో అప్పటి నుంచి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని టాక్. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సంజయ్ కుమార్ తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారనే వాదన ఉంది.

ఇటీవల జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా అంశంతో సంజయ్ పై అధిష్టానం మరింత ఆగ్రహంగా ఉందన్న వార్తొలొస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటనకు విచ్చేసిన నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ఆరా తీశారట. కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురించి సీఎం కేసీఆర్ కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. దాంతో ఈసారి జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు టాక్.

జగిత్యాల బరిలో కవిత ? *కవితను బరిలోకి దింపడమే కరెక్ట్ !
జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కష్టకాలం మొదలైందని బీఆర్ఎస్ పెద్దలు అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలసత్వం వహిస్తే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఈ సీటులో సత్తా చాటే అవకాశం ఉందని గులాబీ హైకమాండ్ అంచనా వేస్తోందట. అందుకే ఈసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ కవితను బరిలోకి దింపే ఆలోచన జరుగుతోందని సమాచారం. ఈ ప్రతిపాదనకు కవిత కూడా సుముఖంగానే ఉన్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. కాబట్టి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై కవితకు మంచి పట్టుంది. అందుకే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కవిత పేరు బలంగా వినిపిస్తోంది.

 

* బీఆర్ఎస్ పై సానుకూలం.. సంజయ్ పైనే వ్యతిరేకత
జగిత్యాలలో ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలున్నాయని టాక్. కానీ అదే బీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత బరిలో ఉంటే సమీకరణాలు మారిపోతాయి. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ గెలిచే అవకాశాలు కవితకే ఎక్కువ. అంతేకాదు కవిత మంచి మెజార్టీతో విజయం సాధించవచ్చని గులాబీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. జగిత్యాలలో వ్యతిరేకత సంజయ్ కుమార్ పైనే తప్ప బీఆర్ఎస్ పై లేదని గులాబీ శ్రేణుల వాదన.

* పోటీ మాత్రం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే!
ఇక ఇక్కడ బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేంత బలమైతే ఉండకపోవచ్చు. కాబట్టి బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత బరిలో ఉంటే ఫలితం ఒకలా, ఆమె బరిలో లేకపోతే ఫలితం మరోలా ఉండొచ్చన్నది మాత్రం వాస్తవం. మరి జగిత్యాల బరిలో కల్వకుంట్ల కవిత ఉంటారా? లేదా సంజయ్ కుమార్ మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ పడతారా? లేక కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి సత్తా చాటుతారా? అన్నది చూడాలి.