రేవంత్ రెడ్డి అడ్డాలో పట్నం పాగా !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : 2009కి ముందు కొడంగల్ నియోజకవర్గం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారో, అప్పటి నుంచి కొడంగల్ పేరు అందరికీ సుపరిచితమైపోయిందంటే అతిశయోక్తి కాదు. 2009 తర్వాత రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ దెబ్బతో 2014లోనూ మరోసారి కొడంగల్ నుంచి విజయదుందుభి మోగించారు.
* రేవంత్ కు గట్టిగా తగిలిన బీఆర్ఎస్ దెబ్బ
కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రేవంత్ లైఫ్ మరో టర్న్ తీసుకుంది. నోటుకు ఓటు కేసు, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో 2018లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున కొడంగల్ బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ హైకమాండ్ కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించడం, హరీశ్ రావు ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేయడంతో పరిణామాలన్నీ రాత్రికి రాత్రి మారిపోయాయి. రేవంత్ గెలుపు ఖాయమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పట్నం నరేందర్ రెడ్డి రేసులోకి వచ్చారు. టీఆర్ఎస్ తరపున పట్నం నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. మంచి మెజార్టీతో రేవంత్ రెడ్డిపై విజయఢంకా మోగించారు. రేవంత్ రెడ్డిని ఓడించి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు.
*రేవంత్ కి కలిసొచ్చిన ఓటమి
రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయారో ఆయన పొలిటికల్ కెరీర్ ఖతం అని అనుకుంటే, ఆ ఓటమే ఆయనకు కలిసొచ్చింది. 2019లో ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలిచి, గెలిచి చూపించారు రేవంత్. ఆ తర్వాత ఏకంగా పీసీసీ చీఫ్ అయిపోయారు. అదంతా పక్కన బెడితే మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన తర్వాత కొడంగల్ పై రేవంత్ ఫోకస్ తగ్గిందన్నది మాత్రం వాస్తవం. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడ ఫోకస్ పెట్టినా పట్నం నరేందర్ రెడ్డిని మ్యాచ్ చేయలేకపోతున్నారన్న వాదన ఉంది.
*హస్తానికి ఈ సారి కష్టాలే !
కొడంగల్ లో ఓవైపు ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చేరికలకు ఇస్తున్న ప్రాధాన్యతతో చాలామంది కాంగ్రెస్ క్యాడర్ కండువా మార్చేశారు. కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి జంప్ కొట్టారు. దీంతో స్థానికంగా హస్తం పార్టీ వీక్ అయిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పట్నం నరేందర్ రెడ్డి ఊరూరా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా పట్నం నరేందర్ రెడ్డికే జై కొడుతున్నారు. రేవంత్ రెడ్డి కోటను బద్దలు కొట్టడమే కాకుండా, ఇక కొడంగల్ గడ్డ తనదేనని బల్లగుద్ది చెబుతున్నారు. రేవంత్ కు ఇక్కడి వాస్తవాలు తెలుసో లేదో కానీ ఇప్పటికే ఆలస్యం జరిగిపోయిందన్న మాట అయితే వినిపిస్తోంది. హస్తం ఇక్కడ పుంజుకోవాలంటే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*ఇక్కడ బీఆర్ఎస్ కే 100 శాతం అనుకూలం
ప్రస్తుతం పార్టీల వారీగా చూస్తే కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి ఫాలోయింగ్, క్రేజ్ ఎక్కువగా ఉంది. అధికార పార్టీ కావడంతో ఆయన క్యాడర్ కు కావలసిన పనులు కూడా చేసి పెడుతున్నారట. దీనికి తోడు అభివృద్ధి కూడా జోరందుకుంది. దీంతో బీఆర్ఎస్ కు ఇక్కడ అనుకూల వాతావరణమే ఉందని టాక్. కాంగ్రెస్ విషయానికొస్తే రేవంత్ రెడ్డి వస్తే తప్ప ఇతర నాయకులు ఎవరు నిలబడినా బీఆర్ఎస్ కు టఫ్ కాంపిటిషన్ ఇవ్వకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. అలా అని కొడంగల్ బరిలోకి రేవంత్ రెడ్డి వచ్చే పరిస్థితి కూడా లేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఇక బీజేపీకి ఇక్కడ అంత ఓటు బ్యాంకు లేదు. చెప్పుకోతగ్గ లీడర్లు కూడా లేరు. దీంతో రేసులో బీఆర్ఎస్సే ముందుందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కోటలో పట్నం నరేందర్ రెడ్డి మరోసారి పాగా వేసే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలను పక్కన బెడితే కొడంగల్ లో ఈసారి ఎలక్షన్ లో ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ!