గులాబి గూటికి చేరిన కార్పొరేటర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిడ్ల రాజు యాదవ్ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్ రాజుతో పాటు 31వ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు పెరుగు సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రపాల్, వేల్పుల భిక్షపతి, కాంగ్రెస్ నుండి యూత్ నాయకులు సునీల్, అఖిల్, రాకేష్ తదితరులు కార్పొరేటర్ రాజుతో కలిసి టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వీరికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నామని కార్పొరేటర్ రాజు అన్నారు. హనుమకొండ నగరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు. వారి నాయకత్వాన్ని రాబోయే కాలంలో బలపర్చేందుకు తన డివిజన్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులను సంప్రదించి వారితో కలిసి నేడు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో డివిజన్ అభివృద్ధికి పాటుపడుతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే నరేందర్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కూడా డైరెక్టర్ మాడిశెట్టి శివశంకర్, పత్తి సంపత్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.