ఒకే రోజు 1.08కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్

ఒకే రోజు 1.08కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్ లో ఇండియా మరో మైలురాయిగా సాధించింది. మంగళవారం ఒకే రోజు 1.08 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికార్డుస్థాయిలో ఒకేరోజు మొత్తం 1,08,84,899 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పింది. జనవరిలో టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 65,03,29,061 మోతాదులు వేసినట్లు పేర్కొంది.

ఇందులో 50,12,44,655 మొదటి మోతాదులు కాగా, 14,90,84,406 మందికి రెండో మోతాదు వేసినట్లు చెప్పింది. 60 యేళ్లు పైబడిన 13.34 కోట్ల మందికి టీకాలు వేయగా, 45- 60 యేళ్ల వయస్సున్న గ్రూప్ లో 19.76 కోట్ల మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. 18- 44 ఏజ్ గ్రూప్ లో ఇప్పటివరకు 31.57 కోట్ల మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా, ఇంతకు ముందు ఈ నెల 27న సైతం ఇండియాలో మొదటిసారిగా కోటి డోసుల వ్యాక్సిన్ వేసింది.