కేసీఆర్ ను కలిసిన సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు

కేసీఆర్ ను కలిసిన సీపీఐ, సీపీఎం జాతీయ నేతలుహైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నిస్తోన్న కేసీఆర్ గతంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎం మమతాబెనర్జీ, సీఎం స్టాలిన్ ను కలిశారు. ఆ ప్రక్రియకు మధ్యలో బ్రేకులు పడింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఎంకు కేసీఆర్ స్నేహహస్తం అందిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగానే నేడు కేసీఆర్ జాతీయ స్థాయి సీపీఐ, సీపీఎం నేతలతో భేటీ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.

సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. మూడు రోజుల పాటు జరుగనున్న పార్టీ జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు హైదరాబాద్ వచ్చారు. సమావేశాలకు వచ్చిన నేతలను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు ఆహ్వానించి, విందు ఏర్పాటు చేశారు. అనుబంధ సంఘం అఖిల భారత యువజన సమాఖ్యలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సీపీఐ జాతీయ నేతలను సైతం కేసీఆర్ ఆహ్వానించారు.

వీరంతా శుక్రవారమే కేసీఆర్ తో భేటీ కావాల్సి ఉంది. అనివార్య కారణలతో భేటీ వాయిదా పడింది. మొత్తానికి ఉభయ కమ్యూనిస్ట్ కీలక నేతలు నేడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. విందు అనంతరం కేసీఆర్ సీపీఎం నేతలతో గంటన్నర పాటు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

దేశంలో బీజేపీని ఎలా పడగొట్టాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు పెద్దలు సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీని నిలువరించే దిశగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉంది. తెలంగాణ ఏర్పడిన చాలా కాలానికి మళ్లీ ఆ మూడు పార్టీలు దగ్గరవుతూ, పలు స్థానిక ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నాయి.

సీఎం కేసీఆర్ ను కలిసిన సీపీఎం బృందంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, బాలకృష్ణన్, ఎంఏ బాబీ తదితరులతో పాటు తెలంగాణ శాఖ నేతలు కూడా ఉన్నారు. ఇక ప్రగతి భవన్ విందుకు వచ్చిన సీపీఐ నేతల బృందంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, తెలంగాణ సీపీఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్ధులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులున్నారు.

వీరికి విందు ఇచ్చిన టీఆర్ఎస్ బృందంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.