‘వరి పోరు’తో దద్దరిల్లిన ధర్నా చౌక్..

'వరి పోరు'తో దద్దరిల్లిన ధర్నా చౌక్..
హైదరాబాద్ : రైతన్నకు దన్నుగా టీఆర్ఎస్ చేపట్టిన ‘వరి పోరు’ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ దండు కదం తొక్కారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి కర్షకులు, గులాబీ శ్రేణులు నగరంలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ కు తరలివచ్చారు. వరి ధాన్యాన్ని కొనే దాకా పోరాటమే అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పంజాబ్ లో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్షత అంటే ప్రత్యేక ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన నిరసనకు సీఎం కేసీఆర్ నేతృత్వం వహించగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కర్షకులు ముక్త కంఠంతో కేంద్రం దిగిరావాలంటూ దద్దరిల్లేలా నినాదాలు చేశారు.

గ్రేటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వరి పోరు సెగ తగిలింది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణఉలు, ప్రజాప్రతినిధులు ఇందిరా పార్కుకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ధర్నా చౌక్ వైపే సాగాయి. బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో తరలిరావడంతో ధర్నా చౌక్ పరిసరాలు జనసంద్రోహంగా మారాయి. ఇందిరాపార్కు నలువైపుల ప్రాంతమంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయి ఉద్యమ రోజులను తలపించాయి.