వనదేవతలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ కు స్వాగతం పలికారు. వనదేవతల సన్నిధికి చేరుకున్న గవర్నర్ వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి, సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియా సెంటర్ లో గవర్నర్ తమిళిసై మాట్లాడారు.గిరిజనులందరికీ జాతర శుభాకాంక్షలు తెలిపారు. జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి పోవాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర, 2022 ను పురస్కరించుకుని సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ప్రత్యేక సంచిక ( సావనీర్ )ను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సావనీర్ ఆవిష్కరణలో గవర్నర్ తో పాటు, ఎమ్మెల్యే సీతక్క, సమాచార శాఖ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తదుపరి మీడియా పాయింట్ మంచెపై గవర్నర్ కాసేపు సేదతీరారు. గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుంటున్న భక్తులను మంచె మీది నుంచి గవర్నర్ తమిళిసై పరిశీలించారు.