అక్కడ కిడ్నాప్‌ అయిన బాలుడు..ఇక్కడ లభ్యం

అక్కడ కిడ్నాప్‌ అయిన బాలుడు..ఇక్కడ లభ్యం

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : ముంబయిలో కిడ్నాప్‌ అయిన బాలుడు ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని దేచుపాలెం గ్రామంలో దొరికాడు. జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్న ఆరేళ్ల బాలుడిని ఆదివారం మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎస్‌ఐ రామారావు తెలిపిన సమాచారం మేరకు ముంబయిలో 2022, ఫిబ్రవరిలో ఒక బాలుడు అదృశ్యమయ్యాడు.

దీనిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మహారాష్ట్ర పోలీసులు తమ విచారణలో విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ బాలుడిని తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆ మహిళ జగ్గయ్యపేటలోని మరో మహిళకు బాలుడిని రూ.2 లక్షలకు అమ్మివేయగా, ఆమె దేచుపాలెంలోని తమ బంధువుల కుటుంబానికి రూ.3 లక్షలకు బాలుడిని ఇచ్చేసింది. అప్పటి నుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడిని జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చి చదివిస్తున్నారు.