మూడో వన్డేలో ఆసీస్​తో నెగ్గిన భారత్​

ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద్భుత విజ‌యం..మూడో వన్డేలో ఆసీస్​తో నెగ్గిన భారత్​

మూడో వన్డేలో ఆసీస్​తో నెగ్గిన భారత్​క్యాన్‌బెరా : ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలి రెండు వ‌న్డేల్లో దారుణంగా ఓడిన కోహ్లి సేన‌ చివరి వన్డేలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం 13 ప‌రుగుల‌తో గెలిచి సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి ప‌రిమితం చేసింది. చివ‌రి వ‌ర‌కు పోరాడిన ఆసీస్ 49.3 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో పాండ్యా, జ‌డేజా మెరుపులు.. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, న‌ట‌రాజ‌న్ రాణించ‌డంతో ఈ విజ‌యం దక్కింది. మెరుపైన షాట్ల‌తో మ‌రోసారి మ్యాక్స్‌వెల్ భ‌య‌పెట్టినా.. కీల‌క‌మైన స‌మ‌యంలో అత‌న్ని పెవిలియ‌న్‌కు పంపించి మ్యాచ్‌ను భార‌త్ వైపు మ‌లుపుతిప్పాడు పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా. మ్యాక్స్‌వెల్ కేవ‌లం 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేశాడు. విజ‌యానికి మ‌రో 33 బంతుల్లో 35 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బుమ్రా యార్క‌ర్‌కు క్లీన్‌బౌల్డ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆస్ట‌న్ అగార్ 28 బంతుల్లో 28 ప‌రుగులు చేసి పోరాడినా.. ఆసీస్ గ‌ట్టెక్క‌లేక‌పోయింది. అంత‌కుముందు కెప్టెన్ ఫించ్ త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొనసాగించాడు. 82 బంతుల్లో 75 ప‌రుగులు చేసి వికెట్​ కోల్పోయాడు.. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3, బుమ్రా, న‌ట‌రాజ‌న్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంత‌కుముందు టాప్, మిడిలార్డ‌ర్ ఫెయిలైనా.. చివ‌ర్లో ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జడేజా చెల‌రేగ‌డంతో 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 302 ప‌రుగులు చేసి విజయం సాధించింది.