పరిపాలనకు న్యాయవ్యవస్థ అడ్డురాదు : ఎన్వీ రమణ
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో నేడు ఢిల్లీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తమ విధుల నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఒకవేళ అన్నీ చట్టంలోబడే జరిగితే, అప్పుడు పరిపాలనీ వ్యవస్థకు న్యాయవ్యవస్థ అడ్డురాదని ఎన్వీ రమణ అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే, అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీజే రమణ తెలిపారు. కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక యేండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశానికి హాని కల్గించే అంశాలపై కోర్టులు ఎన్ని తీర్పులిచ్చినా, కావాలనే ఆ తీర్పు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విధాన నిర్ణయాలు తమ పరిధిలోకి రావని, కానీ ఎవరైనా వ్యక్తి తమ వద్దకు ఫిర్యాదుతో వస్తే, ఆ వ్యక్తిని కోర్టు తిరస్కరించదని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలను, ఆందోళనలను అర్ధం చేసుకుని, వాటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చట్టాలను చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం సహించేదిలేదన్నారు. ప్రజా ప్రయోజన వాజ్యాలను, వ్యక్తిగత వాజ్యాలుగా వాడుతున్నట్లు ఆరోపించారు. రాజకీయ, కార్పొరేట్ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు పిల్స్ వేస్తున్నారని రమణ విమర్శించారు.