జూన్ లో అందుబాటులోకి ‘కాళోజీ కళాక్షేత్రం’!
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘ప్రజాకవి’ కాళోజి నారాయణ పేరుతో నిర్మిస్తున్న ‘కాళోజీ కళాక్షేత్రం’ నిర్మాణ పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్..చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి సమీక్షించారు.తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హనుమకొండ బాలసముద్రంలో ప్రతిష్టాత్మకంగా మూడు ఎకరాల్లో రూ.50కోట్ల వ్యయంతో ‘ప్రజాకవి’ కాళోజి నారాయణ గారి పేరుతో ‘కాళోజీ కళాక్షేత్రం’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. కూడా (KUDA) ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు శరవేగంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను సూచించారు. ఈ సమీక్షలో స్పోర్ట్స్, టూరిజం సాంస్కృతిక శాఖల కార్యక్రమాల క్యాలెండర్ లను రూపొందించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ హరికృష్ణ, ప్రొ. తిరుమల రావులు కూడా పాల్గొన్నారు.