యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్

యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్ఉత్తరప్రదేశ్ : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం యోగీ ప్రభుత్వం నియమించింది. ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది కంగనా. అంతేకాదు బీజేపీతో కూడా దగ్గరగా ఉంటోంది. ఇదిలా ఉండగా సినీ గ్లామర్ ఉన్న కంగనాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ (ODOP)పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది.

ఈ సందర్భంగా కంగనా లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ షెగ్వాల్ ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకానికి సినీ నటి కంగనా రనౌత్ యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కంగనా కూడా సీఎం యోగితో భేటీ అయిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం యోగితో కంగనా భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 75 జిల్లాల్లో ప్రత్యేకమైన సంప్రదాయ పారిశ్రామిక హబ్స్ సృష్టించేందుకు ప్రభుత్వం ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రోగ్రాం ప్రవేశపెట్టింది.

ఈ భేటీలో ప్రభుత్వ పనితీరుపై కంగనా మాట్లాడినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం యోగి ప్రభుత్వ పనితీరు బేషుగ్గా ఉందంటూ ప్రశంసించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం చేపట్టిన విధానాలను ఆమె మెచ్చుకున్నట్లు పేర్కొన్నాయి. కంగనా రనౌత్ ట్విట్టర్ సస్పెండ్ కావడంతో యోగీతో భేటీకి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగీ గెలవాలని కంగనా ఆకాంక్షించారు. రామ మందిర భూమి పూజలో వినియోగించిన రామ్ దర్బార్ నాణెన్ని కంగనాకు సీఎం యోగి బహుమతిగా అందించారు. దానికి కంగనా సీఎం కు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం కంగనా సర్వేష్ మేవారా డైరెక్షన్ లో ‘తేజస్’ లో కంగనా IAF ఆఫీసర్ రోల్ చేస్తోంది.