కేంద్రంపై పోరుకు కేసీఆర్ దిశా నిర్దేశం 

కేంద్రంపై పోరుకు కేసీఆర్ దిశా నిర్దేశం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు కూడా హాజరయ్యారు.కేంద్రంపై పోరుకు కేసీఆర్ దిశా నిర్దేశం ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై కేసీఆర్ పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని నిలదీసేలా ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రుల బృందంతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారని, ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక గతయేడాది నవంబర్ లోను ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, ప్రధాని, కేంద్ర మంత్రులను కలువలేకపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.