హుజూర్ నగర్, చండూరులో కేటీఆర్ పర్యటన
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్ నగర్, చండూరు మున్సిపాలిటీలతో పాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి ఉదయం 10.50 గంటలకు హుజూర్ నగర్ చేరుకుంటారు. అక్కడ రూ.30 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, రూ. కోటి వ్యయం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చండూరుకు చేరుకుంటారు. మున్సిపాలిటీలో రూ.30కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్మించనున్న చేనేత క్లస్టర్లకు భూమిపూజ చేస్తారు.