మళ్లీ మొదలైన లాక్ డౌన్..ఎక్కడో తెలుసా..!

మళ్లీ మొదలైన లాక్ డౌన్..ఎక్కడో తెలుసా..!రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణలో ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఐనప్పటికీ ఎక్కడో ఓ చోట ఒమిక్రాన్ దాడికి ప్రజలు గురికావాల్సి వస్తోంది. దీనికి తోడు మళ్లీ లాక్ డౌన్ లు సైతం ప్రకటించుకోవాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఓ గ్రామంలో లాక్ డౌన్ ప్రకటించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలే గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 షాంపిల్స్ వైద్యాధికారులు సేకరించారు.

ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ చేశారు. అయితే వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. దీంతో గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆ గ్రామ పంచాయితీ తీర్మాణం చేసింది.తెలంగాణలో నిన్న అత్యధికంగా 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం 12మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.