ప్రీతిని కావాలనే సైఫ్ టార్గెట్ చేశాడు: సీపీ

ప్రీతిని కావాలనే సైఫ్ టార్గెట్ చేశాడు: సీపీ

ప్రీతిని కావాలనే సైఫ్ టార్గెట్ చేశాడు: సీపీవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు మెడికో సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మెడికో సైఫ్ నుకోర్టు ముందు హాజరుపరిచారు. సీపీ ఏవీ రంగనాథ్ ఈ కేసులో కీలక విషయాలను మీడియా ముందు వెల్లడించారు. పీజీ అనస్థీషియా సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపణలు వస్తోన్న వేళ ఈ కేసులో కీలక అంశాలను ఆయన తెలిపారు.

ప్రీతి ఆత్మహత్యాయత్నాయత్నం కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన అన్నారు. సైఫ్ కావాలనే ప్రీతిని టార్గెట్ చేసి వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందని ప్రాథమికంగా వెల్లడించారు. ప్రీతి గత యేడాది నవంబర్ లో వరంగల్ కేఎంసీలో పీజీ అనస్థీషియాలో చేరిందని అన్నారు. ఇక డిసెంబర్ నుంచే సైఫ్ కారణంగా ఆమె ఇబ్బందులు పడుతోందని, ఫోన్ చాట్స్ ద్వారా ఈ విషయం అర్థం అవుతోందని చెప్పారు. సైఫ్ మొబల్ లో అన్ని ఆధారాలను సేకరించినట్లు చెప్పారు. తన స్నేహితులతో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడని, సైఫ్ కి ప్రీతి తనను ఎందుకు వేధిస్తున్నావంటూ మెసేజ్ కూడా చేసిందని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. సైఫ్ వేధింపులే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించాయని సీపీ అన్నారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్ట్ చేసినట్లు సీపీ వివరించారు. వీడియో :

ప్రీతి తెలివైన అమ్మాయి, చాలా ధైర్యవంతురాలని, అలాగే సున్నిత మనస్కురాలని సీపీ తెలిపారు. కేఎంసీలో సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ ఉందని. అయితే ఇది బాసిజం తరహాలో ఉందని భావించిన ప్రీతి ప్రశ్నించే తత్వాన్ని వెలికితీసిందన్నారు. అందులో భాగంగానే తనపై బాసిజం చేస్తున్న సీనియర్ మెడికో సైఫ్ ను కూడా ప్రశ్నించినట్లు వాట్సాప్ చాట్స్ ద్వారా తెలిసిందని సీపీ రంగనాథ్ తెలిపారు. ఆమెలో ఉన్న ప్రశ్నించే తత్వమే సైఫ్ కు మింగుడుపడినట్లు లేదన్నారు.

ఇక ప్రీతి ఆత్మహత్యాయత్నం పై సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న అవాస్తవాలను సీపీ రంగనాథ్ కొట్టిపారేశారు. విషయాలను లోతుగా తెలుసుకుని, నిజానిజాలను తెలుసుకున్నాకే పబ్లిష్ చేయాలన్నారు. ప్రీతి విషయంలో వస్తున్న తప్పుడు వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఘటనలో రాజకీయ కోణమే లేదని తేల్చిచెప్పారు. పక్కాగా వారి వాట్సాప్ చాట్స్ ను ఆధారం చేసుకునే అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. వారి దర్యాప్తులో తేలిన విషయాలను సీపీ వివరంగా మీడియాకు తెలిపారు.

ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేశారు. గ్రూప్ లో తనని ఉద్దేశించి చాట్ చేయడం సరికాదని సైఫ్ కి ప్రీతి వ్యక్తిగతంగా వాట్సాప్ మెసేజ్ పంపింది. ఏదైనా ఉంటే హెచ్ఓడీలకు ఫిర్యాదు చేయాలి కానీ, అందరిలో అవమాన పరచడం సరైంది కాదని చాట్ చేసింది. ఫిబ్రవరి 20న ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రి నరేందర్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రీతి తండ్రి నరేందర్ ఏఎస్ఐ. అయితే నరేందర్ ఈ విషయాన్ని మట్వాడా ఎస్సై ద్వారా ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 21న ఉదయం మొదట సైఫ్ తో, ఆ తర్వాత ప్రీతి హెచ్ ఓడీతో పోలీసులు మాట్లాడారు. ప్రాక్టీస్ కి సంబంధించిన విషయాలను నేర్పించడానికే కొన్ని సార్లు గట్టిగా చెబుతామని, అది వారి మంచికోసమేనని సైఫ్ తెలిపినట్లు సీపీ చెప్పారు. వేధించాలనే ఉద్దేశం తనకు లేదని సైఫ్ తెలిపినట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు.

ఇదే క్రమంలో సైఫ్ చాట్ హిస్టరీ కూడా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ప్రీతికి సహకరించవద్దని తోటి విద్యార్థులకు సైఫ్ సూచించినట్లుగా మెసేజ్ లు ఉన్నాయని సీపీ వివరించారు. సైఫ్ కావాలనే ప్రీతిని టార్గెట్ చేశాడనే విషయం ఫోన్ చాట్స్ ద్వారా ప్రాథమికంగా అర్థం అవుతోందన్నారు. ప్రతీ కాలేజీలో ర్యాగింగ్ అనేది కామన్ అన్న సీపీ , ఒక వ్యక్తి ఇన్ సల్ట్ గా ఫీలైతే అది ర్యాగింగ్ కిందకే వస్తుందన్నారు. ఆ అమ్మాయినే టార్గెట్ చేసుకుని హేళన చేస్తున్నట్లు చాట్స్ ద్వారా తమ ఇంటరాగేషన్ లో తేలిందని సీపీ తెలిపారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.