కంటి వెలుగుపై ఎమ్మెల్యే చల్లా దిశా నిర్దేశం
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలం కోనాయిమాకుల రైతువేదికలో కంటివెలుగు కార్యక్రమం పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులకు కంటి వెలుగు కార్యక్రమంపై ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు.జనవరి 18 నుంచి జూన్ 30 వరకు జరిగే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ఈ నెల18న ఖమ్మంలో ప్రారంబించనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కంటివెలుగు మొదటి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో క్యాంపులు నిర్వహణ చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు.